Wednesday, 16 January 2019

స్వయంకృతం

" స్వయంకృతం  "

కౌసల్యా ,సుప్రజా , రామా అంటూ చిన్నగా సుప్రభాతము వినిపిస్తోంది...నులి  వెచ్చని,
సూర్య కిరణాలు , కాషాయం రంగు పూసుకుని ప్రాతః కాల సొగసులు రంగరించుకుని , పరుచుకుంటున్నాయి..
వివేక్ ప్రతి రోజు ఉదయం ఆ కిరణాలు తాకేలా , లాను లో కూర్చుని కాఫీ తాగడము అలవాటు.

అద్భుతమైన వాతావరణం, చల్ల ని 
గాలులు వింజామరలు వీస్తుండగా ,పేపర్ చదువుతూ, వేడి వేడి కాఫీ, పరిమళాలు వెదజల్లుతుండగా ఆస్వాదిస్తూ  తాగుతున్నాడు.

ఇంతలో గేట్ చప్పుడు అయ్యింది. ఎవరా అని చూస్తే తన స్నేహితుడు రాము వస్తున్నాడు. 

పేపర్ పక్కన పెట్టి , రారా రాము ఏమిటి విశేషము. ఇంత పొద్దున్నే వచ్చావు.
ఎలా ఉన్నారు అందరూ... అంటూ ,
సుజాతా రాము వచ్చాడు మంచి కాఫీ పట్టుకు రా అన్నాడు. 

రాము వచ్చి కూర్చున్నాడు.
కాఫీ పట్టుకుని వచ్చింది సుజాత. శుభోదయం అన్నయ్య గారు ఈ మధ్య రావడము లేదు, వదినగారు , పిల్లలు ఎలా ఉన్నారు.. అంటూ కాఫీ అందించింది.
బాగానే ఉన్నారు అమ్మా,, 
ఈ మధ్య వీడిని కలవలేదని ఇలా వచ్చా... అన్నాడు.
కాఫీ లు అయ్యాక , 

ఇప్పుడు చెప్పారా ఏమిటి విశేషాలు, భూషణం తో వ్యాపారం పెట్టావుగా, ఎలా జరుగుతోంది.అని అడిగాడు వివేక్.
ఫ్రెండ్ అని నమ్మి అతనికి పార్టనర్ షిప్ ఇచ్చా.బాగానే ఉన్నాడు కదా అని నమ్మకంతో ముఖ్య మైన పనులు కూడా అప్పచెప్పి నేను విదేశాలకి వెళ్లి వచ్చేసరికి, వాడు మోసం చేసాడు. చాలా డబ్బు తినేశాడు. అడిగితే నష్టం వచ్చింది అని చెబుతున్నాడు. వేరే ఆఫీస్ పెట్టి నా కాంట్రాక్టు లన్ని  ఆ సంస్థ తో చేయిస్తున్నాడు. చాలా నష్టం వచ్చింది. 
ఏమి చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు విచారంగా.
అవునా అంత జరిగిందా, అయినా అంత నమ్మకం గా ఏలా వదిలేశావు...

అసలు " వ్యాపారానికి ఉండవలసిన 
ముఖ్య లక్షణము ఎవరిని నమ్మకూడదు". 

 సరేలే ఏదో ఒకటి అలోచిద్దాం, 

నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు అన్నాడు వివేక్. 
నిజం గా ఆ భగవంతుడు ప్రత్యక్షము అయి నాకు వరం ఇస్తానంటే , నన్ను ఇంత మోసం చేసిన వాడిని సర్వ నాశనం చేయాలని కోరుకుంటాను అన్నాడు ఆవేదనగా.
అలా ఆవేశ పడకు.కోపం లో తప్పుడు నిర్ణయం తీసుకుంటావు.ఒక్క విషయం గుర్తు ఉంచుకో...

"ఆనందం గా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు...
కోపం గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు".

ఈ రెండు మనిషికి చేటు తీసుకుని వస్తాయి.
అయినా  
ఒక వేళ నిజంగా సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రత్యక్షమైతే , 

"నువ్వు గొప్పవాడివి అవ్వాలని కోరుకోవాలి కాని, నీ శత్రువు నాశనం కోరుకోవడం ఎందుకు." ...

వాడి వినాశనం కోరుకోవడం వలన వాడికి, ఉన్నది పోతుందేమో గాని , ...
నీకు ఇప్పటి స్థితి లో మార్పు అయితే రాదు... గా, 

నీ సమస్య కి పరిష్కారం ఆలోచించాలి గానీ, ఇలా దూషించడము అసమర్ధుల లక్షణము.

ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు.
అన్నాడు వివేక్.

వాడు చేసిన పాపానికి శిక్ష వేయాల్సింది 
ఆ భగవంతుడు... నువ్వు కాదు, 
నువ్వు ఆలోచించాల్సింది 
ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బైట పడడము ఎలా అని  అన్నాడు వివేక్.

నిజమే రా , నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నా కర్తవ్యం ఏమిటో.
నేను  నన్ను మోసం చేసిన వాడి గురించి ఆలోచించడం మానేసి, 
నా గురించి ఆలోచించడం మొదలు
 పెడితే ప్రస్తుత పరిస్థితి నుంచి బైట పడవచ్చు.
పైగా ఇది " స్వయంకృతం "
ఈ పరిస్థితి నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడింది,  కనుక నేనే మార్చుకోవాలి.
వాడికి అందనంత ఎత్తు ఎదిగి చూపిస్తా .

ఇంక నేను ఏ వరాలు కోరుకొనవసరం లేదు. కష్టపడి సాధిస్తా.
సరిఅయిన సమయానికి మంచి సలహా ఇచ్చావు. 
అదే ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా ..అన్నాడు
ఆల్ ది బెస్ట్ రా ...రాము  అంటూ షేక్ హాండ్ ఇచ్చాడు వివేక్
వస్తా రా వివేక్ అంటూ ముందుకు కదిలాడు రాము రెట్టించిన ఉత్సహం తో...